నేను ఇంటర్ లో ఉన్నప్పుడు మొదటి సారి అమెరికాలో రిసెషన్ అవుతోంది అని, మన వాళ్ళని ఇంటికి పంపించేస్తారు అని విన్నాను. నిజం చెప్పాలి అంటే, అప్పటిదాకా నాకు ఉద్యోగాలు రావటం తప్ప పోవటం అన్నది కూడా ఉంటుంది అని తెలియదు. ( అప్పట్లో నాకు ఇంకా చాలా విషయాలు తెలియవు అనుకోండి).
అప్పుడు మా మామ్మగారికి ( నాన్న కి అమ్మ) చాలా డవుట్లు వచ్చాయి. అసలు ఆ దేశం లో అంత మంది ఉంటే మనవాళ్ళని పిలవటం ఎందుకు, ఇప్పుడు పంపెయ్యటం ఎందుకు అని. అన్నిటికంటే పెద్ద అనుమానం ఏమిటంటే, ప్రాజెక్ట్ కట్టాలి అంటే సివిల్ ఇంజనీర్లు కావలి కాని ఈ కంప్యూటర్లు చదవటం దేనికి అని.
దొరికిందే ఛాన్స్ కదా అని ఇంటర్నెట్, ఈమెయిలు, జావా గురించి నాకు తెలిసిన ( తెలుసు అనుకున్న ) విషయాలు అన్ని చెప్పెయ్యటం మొదలు పెట్టాను. ఇంతలో మా అమ్మ సీన్లోకి ఎంటర్ అయ్యింది.
అసలు ఇంటర్నెట్ అంటే ఎక్కడ నుంచి అయినా చూడచ్చా అని అడిగింది. చూడచ్చు అన్నా.
అంటే, న్యూ యార్క్ వాడు కాలిఫోర్నియా వి కూడా చూడచ్చా అని అడిగింది. అవును అన్నాను.
అందరికి అన్ని దొరికితే, ఏదో ఒకటే నిలుస్తుంది కదా. మన వీధిలో చూడు, నాలుగు కోట్లు ఉంటే, కొన్నాళ్ళయ్యాక ఏదో ఒకటో రెండో ఉంటాయి, మిగతావాటికి ఎవరూ వెళ్ళాక దివాళా తీస్తాయి.
ప్రపంచం లో ఎవరైనా ఎక్కడి కొట్టుకైన వెళ్ళచ్చు అంటే, అందరు అన్నిటి కంటే బాగుండే దానికే వెళ్దాం అనుకుంటారు కదా! ఒకటి ఇంటి పక్కన ఉండి, ఇంకోటి నాలుగు వీధులు అవతల ఉంటే, అప్పుడు అంత దూరం ఎవరు వెళ్తాంలే అని ఆగిపోతాం. ఇక్కడ అన్ని ఒకటే అంత దూరం ఉంటే, బాగా లేని దానికి ఎవరు వెళ్తారు అంది.
అప్పట్లో ప్రతి వాళ్లు వెబ్ సైట్స్ పెట్టేస్తూ ఉంటే, అసలు ఇలా మాట్లాడటం తప్పు అని కోపంగా చూశాను. ( అందుకే నీతో పెద్ద పెద్ద విషయాలు మాట్లాడాను అని మనసులో అనుకునే ఉంటా).
ఇవాళ ఆన్లయిన్ షాప్పింగ్ అంటే 3-4 వెబ్సైట్స్ గుర్తు వస్తాయి. మిగతావి ఒక్కొక్కటి చప్పున మూసేశారు. ఈ విషయం అర్ధం అవ్వటానికి నాకు 10 ఏళ్ళు పట్టింది.
అలాగే సోషల్ నెట్ వర్కింగ్. కనీసం పాతిక సైట్స్ లో ఎకౌంటు ఓపెన్ చేశా. కాని వారానికి ఒక సారి అయినా చూసేవి రెండు సైట్స్ మాత్రమే. మిగతావి బానే ఉంటాయి. కాని వీటి అంత బాగుండవు. అందుకని వాడను.
ఇప్పటికీ కొత్తవి వస్తూనే ఉన్నాయి.
మొన్న ఎప్పుడో మా అమ్మకి సోషల్ నెట్ వర్కింగ్ అంటే ఏమిటో చెప్పా. ప్రతి వాళ్లు పెట్టేస్తే ఎం లాభం ఒకటో రెండో మాత్రమే నిలదోక్కుకుంటాయి కదా అంది. వాటికి తోడుగా పాటలకోసం ఒకటి, ఆటల కోసం ఒకటి ఉంటే ఉండచ్చు తప్పితే ఇలా 50 సైట్స్ లో లాగిన్ అవ్వటం అయ్యేపని కాదు అంది.
Perfect competition, assymmetric competition, strategic locations, niche segments అని జార్గన్ నేను MBA లో నేర్చుకున్నా. మా అమ్మ ఎక్కడ నేర్చుకుందో కాని పాఠాలు నాకంటే శ్రద్ధగా వింది. మా అమ్మకి నాకంటే చాలా ఎక్కువ తెలుసు అనుకుంటూ ఫోన్ పెట్టేశా.
కామన్ సెన్స్ అని ఒకటి ఉంటుంది అని, దాన్ని కూడా వాడుతూ ఉండాలి అని గుర్తు వచ్చింది.